సామాజిక భద్రత, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖకు చెందిన 5,714 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం నియామక పత్రాలను అందజేశారు. గురునానక్ దేవ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధిలో అంగన్‌వాడీ వర్కర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. రానున్న రోజుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో 35,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహించామని, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.