దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగలను నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం ఖాదర్‌పేటకు చెందిన ఎరుకల నల్లబోతుల నాగప్ప అలియాస్ రాజు, అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పేనగలూరు గ్రామానికి చెందిన చప్పిడి మణి అలియాస్ జావిద్ ఇమ్రాన్, మరో మైనర్‌ను గురువారం ఉదయం శిరివెళ్ల మండల కేంద్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిరివెళ్లలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులు 8 తులాల బంగారు నగలు చోరీ చేశారని చెప్పారు. అదే మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న శివాలయంలో రూ.80 వేల విలువ చేసే వస్తువులనూ దొంగిలించారు. మహాదేవపురం గ్రామ పరిధిలోని సర్వనరసింహస్వామి దేవాలయంలో హుండీలోని రూ.32,261 అపహరించారు. వీరి నుంచి మొత్తం రూ.3.86 లక్షల విలువ చేసే వస్తువులు, నగదుతో పాటు ద్విచక్రవాహనాన్ని చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.