ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది.. నేటి (సెప్టెంబర్ 1) నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అమలవుతోంది. దీని కోసం రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్న CARD 1.0 స్థానంలో CARD 2.0 ను తీసుకొచ్చారు. కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ విధానం సులువుగా ఉంటుందని.. కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన విధానం ద్వారా ప్రజలు ఎవరికి వారు నేరుగా ఆన్‌లైన్‌లో దస్తావేజులు తయారు చేసుకునేలా కొత్త విధానాన్ని రూపొందించారు.. అలాగే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇకపై మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రజలు సులువుగా రిజిస్ట్రేషన్లు చేసుకునే పద్దతిని తీసుకొచ్చింది. వినియోగదారులు తమ వివరాలను నేరుగా నమోదు చేసుకోవచ్చు.. డైరెక్ట్‌గా ఫీజు కూడా చెల్లించొచ్చు. కొత్త విధానం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తైన 20 నిమిషాల్లో దస్తావేజులు కూడా చేతికి వస్తాయి. ఈ విధానం సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నా.. సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి సాయిలో ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన విధానానికి సంబంధించి ఇప్పటికే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి.
అంతేకాదు ఈ విధానంలో.. ఆధార్ లింకుతో రిజిస్ట్రేషన్ సేవలను అనుసంధానం చేయడం ద్వారా అసలు వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. ఆధార్‌కార్డులో ఉన్న బయోమెట్రిక్ వివరాలతో సరిపోల్చుతారు..ఈకేవైసీ కూడా పూర్తి చేస్తారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఐజీఆర్ఎస్-ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్‌లోకి లాగిన్ కాగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సైట్‌లోకి వెళ్లి.. దరఖాస్తులో ఆస్తుల వివరాలు, సర్వే నంబర్, లింక్ డాక్యుమెంట్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆయా ఆస్తులకు సంబంధించి పూర్వ దస్తావేజులు స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలు కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన వారి ఫొటోలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే తీస్తారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో వినియోగదారులు ఎలాంటి దస్తావేజులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగానే వివరాలను పరిశీలిస్తారు. ఆన్ లైన్‌లో స్లాట్ ప్రకారం ఆ సమయానికి క్రయ, విక్రయాలకు సంబంధిదించిన వ్యక్తులు.. సాక్షులు రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఈ-సిగ్నేచర్ ద్వారా రిజిస్టేషన్ ప్రక్రియ ముగుస్తుంది.. కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ప్రారంభంలో ఈ ప్రక్రియ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదరువుతాయని.. కానీ ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు అంటున్నారు. అంతేకాదు
దశాబ్దాలుగా వాడుకలో ఉన్న నాన్-జ్యుడిషియల్ స్టాంపు పత్రాల స్థానంలో ఈ-స్టాంపు విధానం అమల్లోకి వచ్చింది. త్వరలోనే వీటి విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రస్తుత ఆన్‌లైన్ విధానంలోనూ డాక్యుమెంట్‌కు స్టాంప్ అవసరం అసలు లేకుండాపోయింది.