ఏపీలో ఒకప్పుడు డబుల్ సెంచరీ దాటిన టమాటా ధర.. ఇప్పుడు మరీ దారుణంగా నెలచూపులు చూస్తోంది. గతవారం పర్వాలేదనిపించినా.. ఈ వారం ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. మదనపల్లె మార్కెట్‌లో ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కిలో టమోటా ధర రూ. 9 కి చేరింది. కిలో టమటాకు రూ.9 దక్కుతుంటే కమిషన్ పోగా చేతికి అందేది కిలోకు రూ. 7 మాత్రమే అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 20 రోజుల క్రితం వరకు చేతి నిండా డబ్బులు ఉంటే.. ఇపపుడు మాత్రం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నామన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు.
టమాటాలను కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడం.. ఎక్స్‌పోర్ట్ చేసేందుకు ట్రేడర్లు ముందుకు రాకపోవడంతో టమోటా కు డిమాండ్ లేకపోతోందంటున్నారు. ఏపీ, తెలంగాణతో పాటూ మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే టమాటా ధర రూ. 50 లోపుకి చేరింది. అలాగే కొన్ని మార్కెట్‌లలో కిలో రూ. 15 నుంచి రూ. 20 వరకు నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.. నగరంలో కేజీ రూ.25 వరకు ఉంది. జులై నెలాఖరు వరకు టమాటాలు రైతులకు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఆగస్టు మొదటి వారం నుంచి పరిస్థితి మారిపోయింది. ధరలు రూ.200 నుంచి రూ.150కు పడిపోయింది. ఆగస్టు రెండో వారంలో 100 వరకు వచ్చింది.. అలా మెల్లిగా తగ్గుతూ రూ.50కు వచ్చింది. ఇప్పుడు మరీ దారుణంగా సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యింది. ఆగస్టు 14న కిలో టమోటా కనిష్ఠ ధర రూ.22 కు చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మరీ దారుణంగా కేజీ రూ.9 మాత్రమే పలుకుతోంది.
ప్రధానంగా చిత్తూరు జిల్లాతో పాటుగా ఇతర ప్రాంతాల్లో టమాటా దిగుబడులు మొదలయ్యాయి. ఆ వెంటనే మార్కెట్‌లలో టమాటాకు డిమాండ్ తగ్గింది. అలాగే పొరుగునే ఉన్న కర్ణాటక, అనంతపురం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో టమటా సాగు చేయడం పెరిగింది. అందుకు తగినట్లుగా దిగుబడి కూడా పెరగడంతో టమాటాలను కొనుగోలు చేసేవారు లేకుండా పోయారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఏపీలోని మార్కెట్‌లకు వచ్చేవారు.. కానీ ధరలు తగ్గడంతో ఇటువైపు కూడా చూడటంలేదు. మొత్తం మీద మొన్నటి వరకు కాసుల పంట పండించిన టమాటాలు.. ఇప్పుడు అన్నదాతలతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. దీంతో రైతులు తమ పరిస్థితి ఏంటి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.