ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్ 3 విజయంపై లాలూ ప్రసాద్ కామెంట్లు,,,,సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

national |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2023, 09:04 PM

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమై భారతీయులంతా సగర్వంగా తలెత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 విజయం వెనుక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలపై దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే చంద్రయాన్ 3 ప్రయోగం గురించి దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా విషయాలు తెలుసుకున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకోకుండా చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం తీవ్ర వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవలె రాజస్థాన్ మంత్రి.. చంద్రయాన్ 3 ప్రయోగంలో వ్యోమగాములు పంపారని చెప్పి నెటిజన్ల చేతిలో తీవ్ర విమర్శల పాలు కాగా.. అలాంటి వ్యాఖ్యలే చేసి కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హస్యాస్పదం అయ్యారు.


ముంబైలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశంలోని చాలా ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశం తర్వాత మాట్లాడిన లాలూ.. చంద్రయాన్ 3 గురించి ప్రస్తావించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని సక్సెస్ చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రుడిపైకి మనుషులను పంపినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు అనడంతో అసలు విషయం బయటపడింది. ఇస్రో చంద్రుడి పైకి మనుషులను పంపించి.. అక్కడ తిరిగేలా చేసి పరిశోధనలు చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టే తదుపరి ప్రయోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సూర్యునిపైకి పంపాలని కోరుతున్నానని పేర్కొనడం మరో విశేషం.


ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్.. చంద్రయాన్ 3 విజయంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వైరల్‌గా మారాయి. లాలూ కామెంట్స్ చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. చంద్రుడిపైకి మానవరహిత మిషన్‌ను పంపించిన ఇస్రో గురించి తెలియదా అంటూ మండిపడుతున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడైన లాలూ ప్రసాద్ యాదవ్‌కు చంద్రయాన్ 3 గురించి ఆ మాత్రం తెలియదా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.


అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో ఇప్పటివరకు ప్రపంచంలోని ఏ దేశానికి సాధ్యం కాని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్ సగర్వంగా అడుగు పెట్టినట్లయింది. ఈ క్రమంలోనే భారత్ కీర్తిని, ఇస్రో శాస్త్రవేత్తల కృషిపై దేశ, విదేశాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇటీవల చంద్రయాన్ 3 విజయం సాధించిన తర్వాత మాట్లాడిన రాజస్థాన్ క్రీడా, యువజన శాఖ మంత్రి అశోక్ చందనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఎందుకంటే చంద్రుడిపైకి ఇస్రో వ్యోమగాములను చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా పంపించిందని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. మరోవైపు.. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాయకుడు ఓపీ రాజ్‌భర్ కూడా చంద్రయాన్ 3 పై వింత వాదనలు చేశారు. చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై దిగినపుడు దేశ ప్రజలు సరిగా స్పందించలేదని.. తర్వాత అది భూమిపైకి సురక్షితంగా చేరుకునే సమయంలో దేశం మొత్తం చంద్రయాన్ 3 ప్రయోగాన్ని స్వాగతించాలని వ్యాఖ్యానించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com