కేంద్ర ప్రభుత్వం తాజాగా తెరపైకి తీసుకొచ్చిన వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ నినాదానికి సంబంధించి కేంద్రం సమాలోచనలు జరుపుతోందన్నారు. ఈ అంశంపై కేంద్రం పెద్దలు తమతో చర్చలు జరిపారన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ధనం ఆదా అవుతుందని, అలాగే ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. అందుకే వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందన్నారు. అయితే ఈ విషయంపై పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జమిలి ఎన్నికలపై చాలా రోజులుగా చర్చ సాగుతోందన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై స్పందిస్తూ... త్వరలో తేదీలను ఖరారు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయన్నారు.