సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి ధర్మన్ షణ్ముగరత్నం ఎంపికయ్యారు. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. చైనా సంతతికి చెందిన అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి సింగపూర్ అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. 2011 తర్వాత సింగపూర్‌లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో షణ్ముగరత్నంచరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం గతంలో సింగపూర్‌కు మంత్రిగానూ పనిచేశారు. 2011 నుంచి 2019 వరకు ఆర్థిక, విద్యా శాఖ మంత్రిగా సింగపూర్ డిప్యూటీ ప్రధానిగా పనిచేశారు. ఆయన పూర్వీకులది తమిళనాడు. బ్రిటన్ సహా పలు దేశాల్లో అత్యున్నత పదవుల్లో భారత సంతతి వ్యక్తులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో సింగపూర్ చేరింది.
సింగపూర్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో షణ్నుగరత్నానికి 70.4 శాతం ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థులు ఎంగ్ కోక్‌సోంగ్, టాన్ కిన్ లియాన్‌కు వరుసగా 15.7 శాతం, 13.88 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఫలితాల అనంతరం షణ్ముగరత్నం అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన షణ్ముగరత్నంకు సింగపూర్ ప్రస్తుత ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ ప్రజలు భారీ ఓట్ల తేడాతో ఆయణ్ని తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ఆయన అన్నారు. తమ దేశాధినేతగా షణ్ముగరత్నం విదేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పదవీకాలం సెప్టెంబరు 13న ముగియనుంది. ఆ వెంటనే షణ్ముగరత్నం సింగపూర్ నూతన అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
భారత సంతతికి చెందిన సెల్లప్పన్ రామనాథన్.. సింగపూర్‌కు అందరికంటే ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పని చేసి రికార్డు సృష్టించారు. ఈయన కూడా తమిళుడే కావడం గమనార్హం. 1981 నుంచి 85 వరకు భారత సంతతికి చెందిన చెంగర వీటిల్ దేవన్ నాయర్.. సింగపూర్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈయన మలయాళీ వ్యక్తి.
షణ్ముగరత్నం1957 ఫిబ్రవరి 25న సింగపూర్‌లో జన్మించారు. ఆయన 19వ శతాబ్దానికి చెందిన తమిళ వంశానికి చెందిన బహుళ-తరాల సింగపూర్ వాసి. ధర్మన్ తండ్రి ప్రొఫెసర్ కె. షణ్ముగరత్నం వైద్యుడిగా సింగపూర్‌లో విశేష గుర్తింపు పొందారు. ‘సింగపూర్‌లో పాథాలజీ పితామహుడిగా’ కీర్తి పొందారు. సింగపూర్ క్యాన్సర్ రిజిస్ట్రీని స్థాపించి, క్యాన్సర్ పరిశోధన, పాథాలజీకి సంబంధించిన అనేక అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన ముగ్గురు పిల్లలలో ఒకరు ధర్మన్.
చైనీస్-జపనీస్ అయిన జేన్ యుమికో ఇట్టోగి ని ధర్మన్ వివాహం చేసుకున్నారు. న్యాయవాది అయిన ఆమె సింగపూర్‌లో ఒక సోషల్ ఎంటర్‌ప్రైజ్. కళల విభాగంలో లాభాపేక్ష లేకండా విశేష కృషి చేస్తున్నారు. ధర్మన్, ఇట్టోగి దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వార్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి సహా ప్రసిద్ధమైన పలు యూనివర్సిటీల నుంచి పట్టాలు అందుకున్నారు ధర్మన్. ఆర్థికవేత్తగా గుర్తింపు సాధించారు. ఆ తర్వాత సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా మారారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa