మీ దగ్గర చీటికీ మాటికీ కరెంట్ పోతుందా..? ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ కోతలు ఉంటున్నాయా? అయితే మీరు విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి పరిహారం పొందొచ్చు. 24 గంటల విద్యుత్ సరఫరా అనేది కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించిన హక్కు. మూడేళ్ల క్రితమే దీనికి సంబంధించి ‘ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020’ని తీసుకొచ్చింది. విద్యుత్తు చట్టం-2003 సెక్షన్ 176 పరిధిలో తీసుకొచ్చిన ఈ నిబంధనలను 2020 డిసెంబరు 31న ప్రకటించిన విషయాన్ని తాజాగా కేంద్రం గుర్తుచేసింది. ఈ నిబంధనల ప్రకారం డిస్కంలు అప్రకటిత/ ఉద్దేశ్యపూర్వక కరెంట్ కోతలు విధించరాదు.
దీని ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా అనేది వినియోగదారుల హక్కు. ఒకవేళ, పంపిణీ సంస్థ ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే నష్టపరిహారాన్ని కూడా పొందే హక్కు వినియోగదారులకు ఉంటుంది.కనెక్షన్, డిస్‌కనెక్ట్, రీ-కనెక్షన్, షిఫ్టింగ్, కన్స్యూమర్ కేటగిరీలో లోడ్ మార్పు, బిల్లులు అందజేయడం, వోల్టేజీని పరిష్కరించడం, బిల్లు సంబంధిత ఫిర్యాదులు వంటి వివిధ సేవల కోసం డిస్ట్రిబ్యూటర్ తీసుకునే గరిష్ట సమయానికి సంబంధించిన ప్రమాణాలను కూడా ఇందులో నిర్దేశించింది. ఈ సేవలను అందించడంలో ఏదైనా జాప్యం జరిగినా.. వినియోగదారులకు పంపిణీ సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వినియోగదారుడికి విద్యుత్ సరఫరా చేయడం, ఇతర నిబంధనలను పాటించడం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విధి. ఒకవేళ ఈ నిబంధనలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ విద్యుత్ సరఫరా చేయలేకపోయినా.. ఇతర సేవలను అందించలేకపోయినా వినియోగదారుడికి పరిహారం చెల్లించాల్సిందే. నిర్దేశిత నిర్దిష్ట వ్యవధికి మించి సరఫరా నిలిచిపోయినా.. కనెక్షన్, డిస్‌కనెక్ట్, రీకనెక్షన్, షిఫ్టింగ్, లోడ్ మార్పు, బిల్లుల అందజేయడంలో జాప్యం జరిగినా వినియోగదారులు పరిహరం కోరవచ్చని ఈ నిబంధనలు చెబుతున్నాయి. అలాగే, వినియోగదారుల వివిధ రకాల ఫిర్యాదులను గరిష్టంగా 45 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.