సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. తాజాగా, ఉదయనిధి వ్యాఖ్యలపై అయోధ్య సాధువు తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి తల నరికి తీసుకొస్తే రూ.10 కోట్ల నగదు బహుమతి ఇస్తానని జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. మరేదైనా మతంపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే ఇప్పటికే హతమై ఉండేవాడరని అన్నారు. కానీ, సనాతన ధర్మ ప్రజలు అహింసను నమ్ముతున్నారు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఉదయనిధి ఫొటోను కత్తితో నరుకుతూ తన నిరసన తెలిపారు.
‘ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ.10 కోట్లు నగదు బహుమతిగా ఇస్తారు.. ఈ నగదు ఇంకా పెంచుతా.. అలా చేయడానికి ఎవరూ సాహసించకపోతే నేనే అతడ్ని చంపుతాను.. ’ అని అయోధ్య తపస్వి చావ్నీ ఆలయ ప్రధాన పూజారి అన్నారు. అయితే, పరమహంస ఆచార్యకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రామచరితమానస్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు, బాలీవుడ్ బాద్‌షా నటించిన పఠాన్ సినిమాలో దీపికా పదుకునే కాషాయ రంగు బికినీ వివాదంపై కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు.
తమిళగ ముర్పోక్కు ఎళుత్తాలర్ సంఘం తరఫున శనివారం సనాతన ధర్మం నిర్మూలనపై చెన్నైలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సనాతన ధర్మం డెంగీ, మలేరియా, కరోనా లాంటిదని, దీన్ని వ్యతిరేకించలేమని, నిర్మూలించాల్సిందేనని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి విరుద్ధమని అన్నారు. సనాతనం అంటే స్థిరమైందని, మార్పులు చేయడం కుదరదని అర్థమని, ఎవరూ ప్రశ్నించడం కుదరదని స్టాలిన్ విమర్శించారు.