కేంద్రంలోని మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 8 నుంచి 10 వరకూ ఢిల్లీలో జీ20 కూటమి శిఖరాగ్ర సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను ముద్రించింది. అయితే, ఈ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొనడంతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ విందులో విదేశీ దేశాధినేతలతో పాటు ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అధికారిక కార్యక్రమానికి మొదటిసారిగా ‘ఇండియా’కు బదులు ‘భారత్’ అని ఆహ్వాన పత్రికపై ముద్రించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో ‘ప్రజాస్వామ్యానికి భారత్ అమ్మ’ అనే టైటిల్‌తో జీ20 బుక్‌లెట్‌లను ముద్రించి... విదేశీ ప్రతినిధులకు అందజేసింది. ‘భారత్ అంటే భారతదేశ పరిపాలనలో ప్రజల సమ్మతి తీసుకోవడం అనేది చరిత్రలో ముందు నుంచి భాగంగా ఉంది’ అని పేర్కొంది.
ఇదే సమయంలో సెప్టెంబరు 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏంటనేది ఇంత వరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో... ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అటు, విపక్షకూటమి 'ఇండియా' అనే పేరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది. బీజేపీ నేతలు దీనిపై ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం పేరును భారత్‌గా మార్చే యోచనలో కేంద్రం ఉందని ఆయన ట్విట్టర్‌లో ఆరోపించారు. ‘ కాబట్టి ఆ వార్త నిజమే. రాష్ట్రపతి భవన్‌లో సెప్టెంబరు 9న జరిగే జీ20 విందుకు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు.. ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’అని ముద్రించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా: అది భారత్’ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మోదీ సర్కార్ వల్ల దీన్ని.. ‘భారత్, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య’ అని చదవాలి. ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి’ అని ఆయన ట్వీట్ చేశారు.