మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఇటీవల ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలోనే భారత్‌పై చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం తీవ్రంగా స్పందించింది. మణిపూర్‌లో ఉన్న పరిస్థితులకు ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం ఇచ్చిన నివేదికకు అసలు పోలిక లేదని పేర్కొంది. ఎక్స్‌పర్ట్స్ కమిటీ వెలువరించిన నివేదిక పూర్తిగా అసమంజసం అని పేర్కొంది. ఈ నివేదికపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
మణిపుర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం చేసిన వ్యాఖ్యలు అసత్యమని, ఊహాజనితం అని భారత శాశ్వత ప్రతినిధి బృందం వెల్లడించింది. కమిటీ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత బృందం పేర్కొంది. ఐరాసలోని మానవ హక్కుల హైకమిషనర్ స్పెషల్ ప్రొసీజర్ బ్రాంచ్ ఆఫీస్ విడుదల చేసిన ఓ నోట్‌పై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధుల బృందం తాజాగా స్పందించింది. మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. మణిపూర్‌లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ అవసరమైన చర్యలను అన్నీ తీసుకుంటున్నాయని వెల్లడించింది.
భారత పౌరుల మానవ హక్కులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మణిపూర్‌లోనూ అదే చేస్తోందని తెలిపింది. తాజాగా ఐరాస నిపుణుల న్యూస్ రిలీజ్‌ను పూర్తిగా తిరస్కరిస్తున్నామని.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధుల బృందం పేర్కొంది. అందులో ఉన్నవన్నీ అసత్యాలు అని.. ఊహాజనితంగా వెల్లడించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదిక పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. మణిపూర్ పరిస్థితిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏమాత్రం అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు అని జెనీవాలోని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి బృందం ఘాటుగా విమర్శించింది.
మణిపూర్‌లో పరిస్థితిపై ఇటీవల ఐరాస నిపుణుల బృందం ఒక నివేదికను విడుదల చేసింది. మణిపూర్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలు, దాడులు జరుగుతున్నాయని వెల్లడించింది. మణిపూర్‌లో లైంగిక హింస, హత్యలు, ఇళ్లు తగలబెట్టడం బలవంతంగా ప్రజలను తరలించడం, వేధింపులు, వివక్ష వంటివి జరుగుతున్నాయని నివేదికలో నిపుణుల బృందం ప్రస్తావించింది. ఈ నివేదికను స్పెషల్ ప్రొసీజర్స్ మ్యాండేట్ హోల్డర్స్ - ఎస్‌పీఎంహెచ్ విడుదల చేసింది. ఈ నివేదికపై స్పందించేందుకు ఉన్న 60 రోజుల గడువును కూడా దృష్టిలో పెట్టుకోకుండా విడుదల చేయడంపై భారత్ శాశ్వత బృందం అసహనం, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లోనైనా అబద్దాలు, అసత్యాలు కాకుండా నిజాలు సేకరించి ఎస్‌పీఎంహెచ్ నివేదికలు తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు భారత ప్రతినిధుల బృందం పేర్కొంది.