ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీకాంత్ కు గవర్నర్ పదవి అని వార్తలు,,,రజినీ తమ్ముడి స్పందన

national |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 08:24 PM

జైలర్ సినిమా ప్రభంజనంతో మంచి జోష్‌లో ఉన్న తలైవా రజినీకాంత్ గురించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా ఆయనకు గవర్నర్ బాధ్యతలు అప్పగించవచ్చంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల వివిధ రాజకీయ నేతలను రజినీకాంత్ కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఆయన స్వయంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వచ్చని వస్తున్న వార్తలపై తలైవా తమ్ముడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారాయి.


రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు.. తమిళనాడు మధురై జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రజనీకాంత్‌కు గవర్నర్‌ పదవి ఇస్తున్నారని వస్తున్న వార్తలపై ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ వార్తలను ఖండించని సత్యనారాయణ రావు.. 'అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. రజనీకాంత్‌కు గవర్నర్ పదవి ఇష్టం లేదని.. ఒకవేళ ఇచ్చినా వద్దనరేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తలైవాకు గవర్నర్ పదవి వార్తలను ఆయన కొట్టిపారేయకపోవడంతో పదవి ఖాయమని అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.


దీనికి తోడు ఇటీవల సత్యనారాయణ రావు మాట్లాడటానికి ఒక రోజు ముందు రజినీకాంత్‌తో తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. అయితే తలైవా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని సత్యనారాయణ రావు తెలిపారు. అయితే పన్నీరు సెల్వం మర్యాదపూర్వకంగానే కలిసి ఉంటారని.. రాజకీయ ప్రవేశం కోసం కాదని చెప్పారు. పన్నీరు సెల్వం త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు తమిళ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే రజినీతో భేటీ తర్వాత పన్నీర్ సెల్వం ఒక ట్వీట్ చేశారు. ఎన్నో ఎత్తులు ఎక్కి.. శాశ్వతంగా శిఖరాగ్రంలో నిలిచిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సమావేశం కావడం చాలా ఆనందాన్ని, సంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు.


అయితే రజినీకి గవర్నర్ పదవి ఇస్తే తమిళనాడు రాష్ట్రానికే ఇవ్వవచ్చని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే తలైవా చెన్నైలోనే స్థిరపడిన వేళ.. సొంత రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదన్న నిబంధన కూడా రాజ్యాంగంలో ఉంది. అయితే రజినీ తమిళనాడులోనే ఉంటున్నా ఆయన స్వస్థలం కర్ణాటక రాష్ట్రం కాబట్టి తమిళనాడు గవర్నర్‌గా నియమించవచ్చు అనేది వాదనలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఇటీవలే నటించిన జైలర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ సినిమా విడుదలకు ముందే తలైవా ఉత్తర భారత పర్యటనకు వెళ్లారు. హిమాలయాల్లో ఓ గుహలో ధ్యానం చేసి పవిత్ర బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్ వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. ఆ సమయంలో యోగి పాదాలకు రజనీ నమస్కరించారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. వాటికి తలైవా చెక్ పెట్టారు. అయోధ్య రామాలయాన్ని సందర్శించి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జార్ఖండ్ గవర్నర్తో భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa