బంగారం విక్రయాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బంగారంపై మరో మార్క్ కనిపిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై ఆరు డిజిట్ల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి. అయితే తాజాగా బంగారునగలకు తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాలన్న నిబంధనను కేంద్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 12 జిల్లాలకు విస్తరింపజేసింది. ఈ మేరకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీలో గతంలో ఈ నిబంధన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఉండేది. తాజాగా అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. తెలంగాణలో ఇదివరకు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే ఈ నిబంధన పరిధిలో ఉండేవి. ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో హాల్‌మార్క్ నిబంధన వర్తించే జిల్లాల సంఖ్య 12కి పెరిగింది.
బంగారం స్వచ్ఛతకు ఇచ్చే ధ్రువీకరణే గోల్డ్ హాల్మార్క్. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉందనే విషయాన్ని ఆ ఆభరణంపై కోడ్ రూపంలో ముద్రిస్తారు. వాస్తవానికి 2021 జూన్ 16 వరకు ఈ పద్ధతిని స్వచ్ఛందంగా అమలు చేయగా.. ఆభరణ తయారీదారులే ఇష్టంగా హాల్మార్క్ వేసేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత హాల్మార్కింగ్ను తప్పనిసరి చేశారు. స్వల్ప కాలంలోనే రెండు కోట్లకు పైగా బంగారు ఆభరణాలపై హాల్మార్క్ ముద్ర పడగా.. లక్షకు పైగా స్వర్ణకారులు దీనికి రిజిస్టర్ అయ్యారు. రోజుకు మూడు లక్షలకు పైగా ఆభరణాలు హాల్ మార్క్ ధ్రువీకరణ పొందుతున్నాయి.
గతంలో హాల్మార్క్ వేసిన ఆభరణాలపై బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత, జ్యువెలరీ లోగో, హాల్మార్క్ సెంటర్ వివరాలను ముద్రించేవారు. ఆరు డిజిట్ల HUID కోడ్ ఉండేది కాదు.. ఇటీవల HUID కోడ్ను ఆభరణాలపై ముద్రించాలని నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం బంగారంపై ఇక నుంచి మూడు గుర్తులే కనిపిస్తాయి. బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు డిజిట్ల HUID కోడ్ మాత్రమే ఆభరణాలపై ఉంటుంది. HUID అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేక కోడ్ కేటాయిస్తుంది.
బంగారం స్వచ్ఛత, హాల్మార్కింగ్పై కస్టమర్లు ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిష్కరించేందుకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఈ విధానం వల్ల ఎలాంటి అవకతవకలకు తావుండదని.. పారదర్శకత పెరగడం సహా, వినియోగదారుల హక్కులకు రక్షణ ఉంటుంది. ఇకపై ఏ జ్యువెలరీ షాపులో ఆభరణాలు కొనుగోలు చేసినా దానిపై హాల్‌మార్క్ నంబర్ చెక్ చేసి కొనాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించే ముందే బీఐఎస్ యాప్‌లో వెరిఫై చేసుకోవచ్చు. ఆభరణాలకు హాల్ మార్క్ నంబర్ హెచ్‌యూఐడీ తప్పనిసరి.. ఒకవేళ లేకపోతే ఆ బంగారం నగలను విక్రయించకూడదు.