ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. భవిష్యత్‌లో సమాజాన్ని శాసించేది ఈ ఏఐ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే భారత్ ఆతిథ్యం ఇచ్చిన జీ20 సమావేశాల్లో ఆస్క్ గీతా(ASK GITA).. ప్రత్యేకంగా నిలిచింది. భారత దేశ డిజిటల్ సామర్థ్యం, డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చిన మార్పులను ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగాన్ని చేసింది. జీ20 సమావేశాలు జరిగే ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఆస్క్ గీతను ఇన్‌స్టాల్ చేసింది. పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఆధారంగా ప్రతీ సమస్యకు వినూత్న పరిష్కారాలను అందించే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది జీ20 దేశాధినేతలను బాగా ఆకర్షించింది.
భారత్ మండపంలోని 4, 16 హాల్‌లలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా ఎక్స్పీరియెన్స్ జోన్లో ఈ ఆస్క్ గీతను ఇన్స్టాల్ చేశారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ భగవద్గీత ఆధారంగా మనం అడిగిన ప్రశ్నలకు సమాధానిమిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆస్క్ గీత.. జీ20 ప్రతినిధులతో పాటు సందర్శకులందరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని కేంద్రం వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ భాషలకు సపోర్ట్ చేసే ఈ ఏఐ మోడల్ ఆధారిత ఆస్క్ గీత ద్వారా మనిషి జీవితంలో ఎదురైన సమస్యలకు భగవద్గీతలో చెప్పినట్లుగా తగిన పరిష్కారాలను అందిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా 2014 నుంచి భారత్‌లో డిజిటల్ పురోగతి, వర్చువల్ ప్రయాణాన్ని తెలియజేస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ట్వీట్ చేసింది.
ఈ ఏఐ ఆధారిత గీతకు కేంద్రం కొత్త నిర్వచనం ఇచ్చింది. గైడెన్స్, ఇన్‌స్పిరేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్షన్ (GITA) అని వెల్లడించింది. ఈ ఆస్క్ గీత యాప్ ద్వారా మనం మన ప్రశ్నలను నేరుగా దాన్ని అడిగే వీలు ఉంటుంది. ఇందులో వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సమస్యలకు పరిష్కారాలను అడగవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలకు సపోర్ట్ చేసే ఈ ఆస్క్ గీత యాప్ ఇంటర్‌ఫేస్.. చాలా సులభంగా ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఇందులో లాగిన్ కావడానికి ఎవరైనా తమ పేరు, వయసు, జెండర్ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న ప్రశ్నలను ఎంచుకోవచ్చు. లేదా ఏదైనా కొత్త ప్రశ్నను కూడా అడిగి అవకాశం ఉంటుంది.
ప్రశ్న అడిగిన వెంటనే దానికి సంబంధించిన సమాధానాన్ని కనుక్కునేందుకు ముందుగా సిద్ధం చేసిన భగవద్గీత సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తుంది. ఆ తర్వాత దానికి పరిష్కారాన్ని కనుగొని.. ఎవరైతే ప్రశ్న అడిగారో వారికి అందిస్తుంది. హిందూ మతానికి చెందిన భగవద్గీత.. ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. చాలా దేశాల్లో తమ తమ భాషల్లోకి భగవద్గీతను ట్రాన్స్‌లేట్ చేశారు. కొన్ని దేశాల్లో అయితే భగవద్గీతను చాలా పవిత్రంగా చూసుకుంటారు. భగవద్గీత నుంచి చాలా ప్రేరణ పొంది జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు బహిరంగంగా ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత సంస్కృతితోపాటు డిజిటల్ ఇండియా ప్రమోషన్‌లో భాగంగా జీ20 దేశాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని భారత్ మండపంలో ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa