జిన్‌పింగ్ ప్రభుత్వంలో కీలక మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా అదృశ్యం కావడం కలకలం రేగుతోంది. మూడు నెలలుగా చైనా విదేశాంగ మంత్రి చిన్ గాంగ్ కనిపించడం లేదు. ఆయన ఎమయ్యారో? ఎక్కడున్నారో? ఇప్పటికీ జాడ తెలియలేదు. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టుతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండం వల్ల చైనా ఆర్మీ అదుపులోకి తీసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా, చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూ విషయంలోనూ అదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దాదాపు, రెండు వారాలుగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూ కనిపించడం లేదని జపాన్‌లోని అమెరికా రాయబారి రహ్మ్ ఇమాన్యుయేల్ ట్వీట్ చేయడంతో మిస్సింగ్ వెలుగులోకి వచ్చింది. చైనా రక్షణమంత్రి ఏమయ్యారు? ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి ? ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారా ? అనేది ఇంకా తెలియరావడం లేదు. చివరిసారిగా ఆయన ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన మూడో చైనా- ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలో కనిపించలేదు.
సోషల్ మీడియాలో ఆయన మిస్సింగ్‌పై వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చిన్‌గాంగ్ కనిపించకుండా పోగా.. ఆ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కమాండర్ల జాడ లేదు. ఈ రాకెట్ ఫోర్స్.. అణు, బాలిస్టిక్ క్షిపణుల ఆయుధాగారాన్ని పర్యవేక్షిస్తుంది. చైనా ప్రభుత్వం తనను ధిక్కరించిన వారిని కఠినంగా అణివేస్తుందనడానికి అలీబాబా (Alibaba) గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యమే ఒక ఉదాహరణ. ఆయన కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు.
అటు, చైనా సైన్యం కూడా ఈ ఏడాది జులైలో ఐదేళ్లకు పైగా హార్డ్‌వేర్ సేకరణకు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ ప్రారంభించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.. ప్రాజెక్ట్‌లు, ఆర్మీ యూనిట్‌లపై సమాచారాన్ని లీక్ చేయడం, కొన్ని కంపెనీలకు బిడ్‌లను పొందడంలో సహాయపడటం వంటి ఎనిమిది అంశాలపై దర్యాప్తు చేపట్టింది. అక్టోబర్ 2017 నాటి నుంచి కొనుగోళ్లను పరిశోధిస్తున్నట్లు సైన్యం తెలిపింది. కానీ, ఆ తేదీకి ప్రాధాన్యతను మాత్రం చెప్పడం లేదు. 2017 నుంచి 2022 వరకూ చైనా రక్షణ మంత్రిగా లీ ఈ విభాగానికి నాయకత్వం వహించారు. అయినప్పటికీ ఆయన తప్పు చేసినట్లు అనుమానించేలా ఎటువంటి సంకేతాలు లేవు.
ఇక, శుక్రవారం ఈశాన్య సరిహద్దుల్లో పర్యటించిన చైనా అధినేత జీ జిన్‌పింగ్.. సైన్యంలో ఐక్యత, స్థిరత్వం గురించి నొక్కిచెప్పారు. రక్షణ మంత్రి మిస్సింగ్ వదంతుల వేళ ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పోరాట సంసిద్ధత స్థాయిని మెరుగుపరచడానికి, నూతన పోరాట సామర్థ్యాలను పెంపొందించే ప్రయత్నాలను కూడా చేయాలని అన్నారు. ఆయన వెంటన చైనా అత్యున్నత సైనిక విభాగం వైస్ చైర్మన్ జాంగ్ యూక్సియా కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa