తన ఆవుపై దాడిచేసి చంపేసిందని ప్రతీకారంతో రగిలిపోయిన ఓ రైతు.. పులులకు విషం పెట్టి చంపేశాడు. సంచలన రేపుతున్న ఈ ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పులుల అనుమానాస్పదమృతి ఘటనలో అటవీశాఖ అధికారులు ఓ వ్యక్తిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఎమరాల్డ్‌లోని నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు వాటికి సమీపంలో ఓ ఆవు కళేబరం లభ్యమైంది. పులులు, ఆవు కళేబరాల నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం కోయంబత్తూరుకు పంపారు.
వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడంతో పులులు చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే ఆవు కళేబరాన్ని విషపూరితం చేసినట్టు వెల్లడించాడు. పది రోజుల కిందట తప్పిపోయిన తన ఆవును వెతకడానికి సమీపంలోని అడవికి వెళ్లానని చెప్పాడు. ఓ చోట ఆవు మృతదేహం కనిపించిందని, దానిని పులి చంపినట్లు గ్రహించానని తెలిపాడు. తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీసుకోవాలని భావించి.. పురుగుమందులతో దాని మృతదేహాన్ని విషపూరితం చేసినట్టు వివరించాడు.
ఆ కళేబరాన్ని తిని కనీసం రెండు పులులలో ఒకదాని మరణానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు. చనిపోయినవాటిలో ఒక పులి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోగా.. మరొకటి గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరో పులి ఎలా చనిపోయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
అయితే, విషపూరిత కళేబరాన్ని తినడానికి ముందు మూడేళ్ల వయసున్న పులిని ఎనిమిదేళ్ల వయసున్న పులి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, గాయాలున్న పులి మరణానికి కచ్చితమైన కారణాలు ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ తర్వాత వెల్లడవుతుందని అన్నారు.