పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే భారత్‌లో కలుస్తుందంటూ కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏమీ చేయకున్నా.. పీవోకే దానంతట అదే మన దేశంలో విలీనం అవుతుందన్నారాయన. ‘కొంత కాలం ఆగండి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతట అదే భారత్‌లో కలిసిపోతుంది’ అని వీకే సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌తో సరిహద్దులు తెరవాలని పీవోకేలోని షియా ముస్లింలు ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో వీకే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బీజేపీ చేపట్టిన పరివర్తన్ సంకల్ప్ యాత్ర సందర్భంగా.. రాజస్థాన్‌లోని దౌసాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వీకే సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు విజయవంతమైందని ఆయన తెలిపారు. ప్రపంచ వేదిక మీద భారత్‌కు అరుదైన గుర్తింపును ఈ సదస్సు ఇచ్చిందన్నారు. తన సత్తా ఏంటో ప్రపంచానికి భారత్ మరోసారి చాటిందన్నారు.
పీవోకే విషయంలో వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరాచీలో కిలో గోధుమ పిండి రూ.320కి విక్రయిస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా గోధుమ పిండి ధరలు ఇంత ఎక్కువగా లేవు. పాక్‌లో పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగుతోంది. కరెంట్ బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయి. రాజకీయంగానూ ఎప్పటిలాగే అనిశ్చితి కొనసాగుతోంది. సైనిక జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఐఎంఎఫ్ బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వకపోతే పాకిస్థాన్ దివాళా తీయడం ఖాయం.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. కశ్మీర్లో పరిస్థితులు క్రమంగా సర్దుకుంటున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్, జీ20 సదస్సు నిర్వహణతో భారత్ ఖ్యాతి మరింత పెరిగింది. దీంతో సహజంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు.. కష్టాల ఊబిలో నుంచి బయటపడి మెరుగ్గా బతకడానికి.. తమ పిల్లల భవిత కోసం.. భారత్‌లో కలిస్తేనే బాగుంటుందనే దిశగా ఆలోచనలు సాగిస్తున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. అక్కడి సహజ వనరులను వాడుకుంటూ లబ్ధి పొందుతోంది. హక్కుల కోసం పోరాడుతున్న పీవోకే వాసులకు పాక్ భద్రతా దళాలు నరకం చూపిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక మందగమనంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. దీంతో పీవోకే ప్రజలు పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న తమకు సాయం చేయాలని పీవోకే ప్రజలు ప్రధాని మోదీని కోరుతున్నారు. ‘ఆకలితో చస్తున్నాం.. మా ప్రాణాలను కాపాడండి.. దయచేసి మాకు సాయం చేయండి’ అని వారు భారత ప్రధానిని అభ్యర్థిస్తున్నారు.
పాక్ ప్రభుత్వం తమను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తోందని గిల్గిట్ బల్టిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పంజాబీలతో పోలిస్తే.. తమను చూసే విధానంలో తేడా స్పష్టమని చెబుతున్నారు. పీవోకే ప్రజల్లో పాక్ పట్ల ఆగ్రహం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో అక్కడ పరిణామాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.