ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో మరోసారి ప్రమాదకర నిపా వైరస్ కలకలం.. కేరళలో ఇద్దరు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 10:30 PM

దేశంలోని మరోసారి ప్రమాదకర నిపా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృతిచెందారు. కోజికోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు వెలుగులోకి రాగా.. వీటికి నిపా వైరస్ కారణమని కేరళ ఆరోగ్య శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులతో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిఫా వైరస్ గురించి ప్రకటన విడుదల చేశారు. మృతుల బంధువు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.


కాగా, ఈ మరణాలకు కారణాల అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది మంగళవారం మధ్యాహ్నం దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదిక అందనుంది. మొదటి మరణం ఆగస్టు 30న సంభవించినట్టు అధికారులు తెలిపారు. కోజికోడ్ జిల్లాలో 2018 నుంచి 2021 మధ్య అనేక నిఫా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాదిలో మొదటి నిపా వైరస్ కేసు 2018 మే 19న నమోదయ్యింది. తర్వాత 2019లోనూ ఈ కేసులు వెలుగుచూశాయి. 2021లోనూ మెదడవాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్ను గుర్తించారు వైద్యులు.


కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా నిపా వైరస్‌ను 1989లో మలేషియాలో గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు వైరస్‌ ఆతిథ్య జీవుల జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించవు. వైరస్‌ ఉన్న గబ్బిలాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తాకినప్పుడు మనుషులకు నిపా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


వ్యాధిగ్రస్త గబ్బిలాల మూత్రం పండ్లుపై చేరినప్పుడు.. వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన వ్యాక్సిన్లు, ఔషధాలు, చికిత్సా విధానం లేకపోవడం మరింత కలవరానికి గురిచేస్తోంది. కోవిడ్‌-19 మహమ్మారితో పోలిస్తే నిపా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైంది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది. నిపా బాధితులతో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే వైరస్ సోకుతోంది. ఈ వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతాయి. బాధితులకు తీవ్రమైన శ్వాసకోశ, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వంటి అనేక రకాల అనారోగ్యాలను కలిగిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com