చంద్రబాబు అరెస్టుపై తెలుగు హీరోలు ఎందుకు మాట్లాడటం లేదని టిడిపి నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షను చేపట్టాయి. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిరాహారదీక్ష టెంట్ వేసుకునేందుకు కూడా పర్మిషన్ కావాలంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో టాలీవుడ్ హీరోలపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత నట్టి కుమార్, ఎక్కడో ఉన్న రజనీకాంత్ వ్యాఖ్యానించారని... తెలుగు హీరోలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా మీ సినీ పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని... కానీ ఒక్కరు కూడా మాట్లాడకుండా హీరోలంతా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. సినిమా హీరోలూ... మిమ్మల్ని చూస్తుంటే సిగ్గనిపిస్తోందని అన్నారు.
జగన్ ను కలిసేందుకు సినిమా హీరోలు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారని, కొందరు సొంత ఫ్లైట్లో వచ్చారని... కానీ జగన్ తో పాటు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు వణికిపోతూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. మీ పరిస్థితి ఏందో ఆరోజు మీకు అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. ఎందుకయ్యా మీకు రోల్స్ రాయిస్ కార్లు? ఎందుకయ్యా మీకు సినిమా స్టార్ డమ్? అని ఎద్దేవా చేశారు. మీ సినిమా టికెట్ల పరిస్థితి ఏందో తెలియదా? అని ప్రశ్నించారు. మీరెక్కడ హీరోలండీ అని దుయ్యబట్టారు. మిమ్మల్ని రాజకీయాలు మాట్లాడమని తాను చెప్పడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి రావాలని మాత్రమే కోరుతున్నానని చెప్పారు.
హీరోలంతా తెలంగాణలో సెటిల్ అయిపోయారని.... ఏపీకి వాళ్లేమీ చేయరని జేసీ విమర్శించారు. రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రభుత్వం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో పిల్లలు ఏమైపోతారో అనే భయం తమకు ఉందని చెప్పారు. మాట్లాడటానికి, కూర్చోవడానికి, నిలబడేందుకు కూడా అవకాశం లేదని అన్నారు. ఎందుకండీ మీరంతా... మీరు బ్రహ్మాండంగా ఉంటే చాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు.