ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలను శుక్రవారం నేరుగా ప్రారంభించారు.. అనంతరం మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలను వర్చువల్ ద్వారా ఆరంభించారు.. ఆ తర్వాత ఐదు కళాశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైద్య కళాశాలలో స్కిల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియంలను పరిశీలించారు.
దేవుడి దయతో రాష్ట్రంలో ఓ మంచి కార్యక్రమం చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులంతా గొప్ప డాక్టర్లు కావాలని.. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని.. అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.