అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులు శుక్రవారం విజయవాడలో శంఖారావ దీక్షలను తలపెట్టారు. ఈ దీక్షలకు సిపిఐ మద్దతు తెలిపింది. దీక్షలకు వస్తున్న బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.......‘‘రాజకీయ పక్షాలు కార్యక్రమాలు చేయకూడదంటే ఎలా? రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తీరా అధికారాన్ని చేపట్టాక బాధితుల గోడు పట్టించుకోవడం లేదు. చివరికి మా పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టుకుంటామంటే పోలీసులను మోహరింపజేసి దిగ్బంధించడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనం. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. ఇక మీదట అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’’ అని రామకృష్ణ హెచ్చరించారు.