రైతు భరోసా కేంద్రాలు, ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా ధాన్యం విక్రయించే ప్రతి రైతు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆర్బీకేల నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసే వాహనాలకు, తర్వాత సీఎంఆర్ రైస్‌ను సివిల్ సప్లయిస్, ఎఫ్‌సీఐలకు చెందిన బఫర్ గొడౌన్లకు తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీఎంఆర్ రైస్‌ను అందిస్తున్న మిల్లుల విద్యుత్తు వినియోగాన్ని ప్రతి నెలా నిశితంగా పరిశీలించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.