భారత్, కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ దేశ పార్లమెంట్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రం అయింది. ఆ తర్వాత కొన్ని గంటలకే కెనడాలో ఉన్న భారత రాయబారిపై ఆ దేశ ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసింది. దీనికి బదులుగా భారత్‌లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన భారత్ సర్కార్.. గట్టిగా సమాధానమిచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణమైంది.
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేతగా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది జూన్ 18 వ తేదీన కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేశారు. అయితే జూన్‌లో జరిగిన ఆ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏకంగా ఆ దేశ పార్లమెంటులోనే తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. 1997లో భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లిన హర్దీప్ సింగ్ నిజ్జర్.. శరణార్ధిగా ఉండేందుకు అతను పెట్టుకున్న అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. తనకు ఆశ్రయం కల్పించిన మహిళను హర్దీప్ సింగ్ నిజ్జర్ పెళ్లాడినా.. అతన్ని శరణార్థిగా గుర్తించేందుకు కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు.
ఇక 2020లో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్ట్‌గా ప్రకటించారు. నిషేధానికి గురైన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ కోసం యువకులను హర్దీప్ సింగ్ నిజ్జర్ రిక్రూట్ చేసేవాడు. అనంతరం వారికి శిక్షణ ఇచ్చి.. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద గ్రూపును కూడా నిజ్జర్ నడిపాడు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 10 వ తేదీన ఖలిస్తానీ రెఫరెండం కూడా నిర్వహించారు. నిజ్జర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గతంలో ఎన్నోసార్లు కెనడాకు భారత్ సూచించింది. 2018 లో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్.. ఉగ్రవాదుల వాంటెడ్ లిస్ట్‌ను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అందించగా.. అందులో నిజ్జర్ పేరు కూడా ఉంది.
ఆ తర్వాత 2022లో నిజ్జర్‌ను తమకు అప్పగించాలని కెనడాను పంజాబ్ పోలీసులు కోరారు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు నిజ్జర్ సహకరిస్తున్నట్లు నివేదించారు. అయితే ఇప్పటికే అనేక కేసుల్లో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. పంజాబ్‌లోని లుథియానాలో 2007లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 42 మంది గాయపడ్డారు. ఇక 2010 పాటియాలా బాంబు బ్లాస్ట్ కేసులోనూ నిజ్జర్ నిందితుడిగా తేలాడు. హిందూ నేతల్ని టార్గెట్ చేసిన కేసులో అతను వాంటెడ్‌గా ఉండటంతో 2015 లో కేసు నమోదు చేశారు. అప్పుడే నిజ్జర్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయగా.. ఇక 2016లో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు.. నిజ్జర్‌ను చంపిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా 2022లో ప్రకటించారు.