సింగపూర్‌లో ఉద్యోగం చేసుకుంటున్న భారతీయ సంతతికి చెందిన 64 ఏళ్ల వ్యక్తికి తాజాగా జైలు శిక్ష పడింది. అయితే ఇదేదో దొంగతనమో లేక హత్యనో లేక నేరమో చేశాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆఫీస్‌లో దగ్గినందుకు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్ రాగా.. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ఆఫీస్‌లోని తన తోటి ఉద్యోగుల ముందు దగ్గడంతో ఈ శిక్ష పడింది. తమిళనాడుకు చెందిన తమిళ్ సెల్వం అనే 64 ఏళ్ల వృద్ధుడు సింగపూర్‌లోని ఓ కంపెనీలో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. తమిళ్ సెల్వంకు 2021 అక్టోబర్ 18 వ తేదీన అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కరోనా సోకినట్లు తేలింది. అయితే నిబంధనల ప్రకారం ఎవరినీ కలవకుండా అతడు ఇంటికి వెళ్లకుండా.. తనకు కొవిడ్ సోకిన విషయాన్ని తెలిపేందుకు తాను పనిచేస్తున్న ఆఫీస్‌కు చేరుకున్నాడు. అయితే అతనికి కొవిడ్ పాజిటివ్ సోకిందని గుర్తించిన తోటి ఉద్యోగులు తమిళ్ సెల్వంను అక్కడి నుంచి వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు.
అయితే అవేమీ పట్టించుకోకుండా తమిళ్ సెల్వం.. అక్కడే తిరుగుతూ దగ్గాడు. అయితే అతడు దగ్గుతున్న దృశ్యాలు ఆఫీస్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. కొవిడ్ సోకిన వ్యక్తి ఆఫీస్‌లో అందరి ముందు దగ్గుతూ తిరగడతంతో తాము తీవ్ర ఇబ్బందికి గురయ్యామని అందులోని కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆఫీస్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని కూడా చెప్పారు. అయితే ఈ ఘటనతో ఆ ఆఫీస్‍లో ఉన్న ఏ ఉద్యోగికి కూడా కరోనా సోకలేదు. అయినా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని భావించి కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు తమిళ్ సెల్వంకు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కరోనా సోకినప్పటికీ దాన్ని సీరియస్‌గా తీసుకోని తమిళ్ సెల్వం ఆఫీస్‌లో తిరుగుతూ తోటి ఉద్యోగులకు తీవ్ర ఇబ్బంది కలిగించాడని భావించిన కోర్టు.. ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధారించింది. అయితే సింగపూర్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. కానీ తమిళ్ సెల్వం వయసు దృష్ట్యా ఈ శిక్షను బాగా తగ్గించినట్లు తెలుస్తోంది.