ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కెనడాప్రధాని ఆరోపణలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ట్రూడో ప్రస్తావించిన అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియెన్నె వాట్సన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కెనడా ప్రధాని ట్రూడో ప్రస్తావించిన ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఆయన పేర్కొన్నారు.
‘కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తావించిన ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం.. కెనడా భాగస్వామ్య పక్షాలతో మేం నిత్యం సంప్రదిస్తూనే ఉన్నాం. కెనడా దర్యాప్తును కొనసాగించడం, బాధ్యులకు శిక్ష పడటం ఇక్కడ కీలకం’ అని శ్వేతసౌధ ప్రతినిధిని ఉటంకిస్తూ కెనడా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక, ఖలిస్థానీ వేర్పాటువాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
జీ20 సదస్సు తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చలకు కూడా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్ ఉద్ఘాటించింది. తాజాగా నిజ్జర్ హత్య అంశంపై భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించిన కెనడా.. ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్.. కెనడాకు గట్టిగానే బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు సమన్లు ఇచ్చి.. ఐదు రోజుల్లో మా దేశం విడిచి వెళ్లాలని ఈ మేరకు విదేశాంగ శాఖ అల్టిమేటం జారీ చేసింది.
ఇక, నిజ్జర్ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్‌లతో తరుచూ ట్రూడో ప్రస్తావిస్తున్నారు. ఇక, హరదీప్ సింగ్ నిజ్జర్.. జూన్ 18న సిక్కుల ప్రాబల్యం అధికంగా ఉండే సర్రే సిటీ గురుద్వార సమీపంలో హత్యకు గురయ్యాడు. 97లో పంజాబ్ నుంచి కెనడాకు వలసవెళ్లిన హర్దీప్ సింగ్.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2020లో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్ట్‌గా ప్రకటించారు.