ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబును విడుదల చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలు... దీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 09:36 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ,,,ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు వరుసగా 10వ రోజు కూడా చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు నేడు కూడా కొనసాగించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ బొబ్బిలి నుంచి సింహాచలం వరకు బొబ్బిలి టీడీపీ ఇన్చార్జి బేబినాయన పాదయాత్రకు పిలుపునివ్వగా... పోలీసులు అడ్డుకున్నారు. విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను అరెస్ట్ చేసి తెర్లం పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం బొబ్బిలి కోట నుండి సింహాచలం వరకు మహిళలు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వారు గులాబీ పూలు ఇచ్చి తమ నిరసన తెలిపారు.


 ఏలూరు నగరంలో టీడీపీ ఇంఛార్జ్ బడేటి చంటి ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఏలూరు బిర్లా భవన్ సెంటర్, మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అన్ని వర్గాల వారిని కలుసుకొని వైసీపీ అరాచక విధానాలను ప్రజలకు వివరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ రోజు బంధ విమోచన యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సైకో క్రిమినల్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ నేతృత్వంలో విశాఖ బీచ్ లో వినూత్న నిరసనకు దిగారు. పీకల్లోతు ఇసుకలో నిలిచి నిరసన తెలిపారు.


నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, వెంకటాపురం గ్రామంలోని ఎల్లమ్మ అమ్మవారి సమక్షంలో గ్రామస్తులతో కలసి రాజమండ్రి సబ్ జైలుకు మాజీ మంత్రి పరిటాల సునీత ఉత్తరాలు రాసి పంపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో గీత కార్మికులు తమ బల్లకట్టులతో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అలాగే చేతివృత్తుల వారు తట్టలు, చేటలు, బుట్టలతో, మత్స్యకారులు వేటాడే వలలతో, గంగిరెద్దుల వాళ్లు తీసుకువచ్చిన బసవన్నతో నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు. 


చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం చర్చలో మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ నిరసన దీక్షలలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, ఎండీ షరీఫ్, బోండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎండీ ఫరూక్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యా రాణి, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, బుద్దా నాగజగదీశ్వరరావు, జ్యోతుల నవీన్, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, నూకసాని బాలాజీ, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com