విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఖాళీగా ఉన్న 43 డాక్టర్ పోస్టుల భర్తీకి అధికారులు వాక్ ఇన్ ఇంటర్య్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూకు హాజరైన వారిలో 27 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించారు. వీరంతా వారం రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఇకపోతే, మిగిలిన 16 పోస్టులకు రోస్టర్ పాయింట్ల ప్రకారం అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో నియామక ప్రక్రియ పూర్తికాలేదు. మిగిలిన పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రోస్టర్ విధానాన్ని అనుసరించడం వల్ల కొన్ని పోస్టులు భర్తీ కావడం లేదని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా వైద్యుల నియామకంతో ఓపీ, ఐపీ సేవలు మరింత మెరుగవుతాయని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. శస్త్ర చికిత్సలు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.