అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన ప్రచారం కోసం నిధుల సమీకరణ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీ సీఈఓలతో త్వరలోనే ఓ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డిన్నర్ పార్టీకి హాజరయ్యే వారి వద్ద నుంచి ఒక్కొక్కరి నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఓ కరపత్రం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆ ఈవెంట్‌లో పాల్గొనే వారి కోసం విడుదల చేసిన టికెట్ ధరలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి పోటీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత వివేక్ రామస్వామి రెండో స్థానంలో ఉన్నట్లు తాజా పోల్స్‌లో వెల్లడైంది.
అధ్యక్ష అభ్యర్థిత్వానికి కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న వివేక్ రామస్వామి.. ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ కోసం
కొత్త ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలోనే సిలికాన్ వ్యాలీ బిజినెస్‌మెన్‌లతో కలిసి డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. వివేక్ రామస్వామి ప్రత్యేక గెస్ట్‌గా సెప్టెంబర్ 29 వ తేదీన ఓ డిన్నర్ నిర్వహించనున్నారు. అయితే ఈ డిన్నర్‌లో పాల్గొనాలనుకునేవారు 50 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.41 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా ఇంట్లో ఈ డిన్నర్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిన్నర్ నిర్వహణలో మరికొంత మంది బిజినెస్‌మెన్‌లు కూడా పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ డిన్నర్ ఈవెంట్‌లో ఆయా కంపెనీల సీఈఓలు వివేక్ రామస్వామితో చర్చలు జరిపే అవకాశాన్ని కల్పించనున్నారు. 10 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.8.5 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్ రామస్వామి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని అయితే 75 శాతం మంది అంటే దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్‌బీఐ సహా వివిధ సంస్థలను మూసివేస్తానని కీలక ప్రకటన చేశారు. ఇక లాటరీ విధానంలో జారీ చేసే హెచ్ 1బీ వీసా ప్రక్రియను రద్దు చేసి.. మెరిటోరియస్ హెచ్ 1 బీ వీసాల పంపిణీని తీసుకువస్తానని స్పష్టం చేశారు. మరోవైపు.. చైనా గుత్తాధిపత్యం గురించి కూడా మాట్లాడిన వివేక్ రామస్వామి.. అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.