త్వరలో జరగబోయే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ విశ్వాసనం వ్యక్తం చేశారు. అంతేకాదు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశ్యర్యానికి గురిచేసే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ఎంపీ జోస్యం చెప్పారు. ఢిల్లీలో అసోంకు చెందినప్రతిదిన్ మీడియా నెట్ వర్క్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో తాము గెలవబోతున్నామని, రాజస్థాన్‌లో పోటా పోటీ ఉండేలా కనిపిస్తోందన్నారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాల వాదనలు వినబడనీయకుండా కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని రాహుల్ విమర్శించారు. కర్ణాటకలో తాము చెప్పాలనుకున్నది కచ్చితంగా ప్రజలకు చేరేలా చెప్పామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024లో విపక్షాల కూటమి బీజేపీని ఆశ్చర్యానికి గురి చేస్తుందని రాహుల్ తెలిపారు. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే సరికొత్త డ్రామాకి బీజేపీ తెరతీసిందని ఆరోపించారు.
తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ తరచూ ఇలాంటివి జిమ్మిక్కులు చేస్తుందని ధ్వజమెత్తారు. దేశ సంపదలో అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇండియా పేరు మార్పు ఇవన్నీ వాటి నుంచి దృష్టి మరల్చేందుకే అన్నారు. తమ సొంత బలాన్ని నిర్మించుకోకుండా దృష్టి మరల్చడం ద్వారా ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందని రాహుల్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో బీజేపీ కట్టుకథలకు అవకాశం ఇవ్వని విధంగా ఎన్నికల్లో పోరాడామని చెప్పారు.
ఈరోజు మీరు చూశారు.. కుల గణన ఆలోచన నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది ప్రజలు కోరుకునే ప్రాథమిక విషయం అని వారికి తెలుసు.. ఆ చర్చను వారు కోరుకోవడం లేదు’ అని లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఇటీవల బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ‘మేము ఒక పాయింట్‌ను టేబుల్‌పైకి తెచ్చినప్పుడల్లా వారు దృష్టి మరల్చడానికి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తారు.. మీడియాను బీజేపీ నియంత్రించే పరిస్థితిలో దానిని ఎలా ఎదుర్కోవాలో మేము ఇప్పుడు నేర్చుకున్నాం’ అని రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్‌లో సాంఘిక సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికలపై కూడా రాహుల్ మాట్లాడారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల గురించి చూస్తే తాము క్రమంగా బలపడుతున్నామని, అక్కడ బీజేపీ ఉనికిలో లేదన్నారు. ఇక్కడ కమలం పార్టీ ప్రభావం పడిపోయిందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదన్నారు. దేశంలో ప్రధాన సమస్యలు సంపద కేంద్రీకరణ, సంపదలో భారీ అసమానతలు, భారీ నిరుద్యోగం, అట్టడుగు కులాలు, ఓబీసీలు, గిరిజన వర్గాలకు భారీ అన్యాయం, ధరల పెరుగుదల అని ఆయన అన్నారు.