ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో 11 రాష్ట్రాలను అనుసంధానిస్తూ 9 వందే భారత్ రైళ్లు

national |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 07:25 PM

కేంద్రంలోని మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం 25 వందే భారత్‌ రైళ్లు పరుగులు తీస్తుండగా.. కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్‌ రైళ్ల సంఖ్య 34కి చేరింది. ఇక, ఆదివారం ప్రారంభించిన కొత్త వందే భారత్ రైలులో ఒకటి రైలు కాషాయ రంగులో (కాసర్‌గోడ్‌-తిరువనంతపురం), మిగిలిన నీలం రంగులో ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో మరో 9 కాషాయ రంగు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.


ఈ క్రమంలోనే కొత్తగా ప్రారంభించిన రైళ్లలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. సీటు రీక్లైనింగ్ నుంచి మొబైల్ ఛార్జింగ్ పాయింట్ల వరకూ మొత్తం 25 ఫీచర్లను మార్పులు చేసినట్టు తెలిపారు. కోచ్‌లలో సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలను పెంచారు. దీంతో ప్రయాణికులు తమ సీట్లను మరింత వెనక్కి జరిపి సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.


సీట్ల కుషన్‌ గట్టిగా ఉందనే విమర్శల నేపథ్యంలో కొత్త కోచ్‌లలో మెత్తటి కుషన్‌లను ఏర్పాటు చేశారు. అలాగే, ఇంతకు ముందు ఎరుపు రంగులో ఉండే ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ సీట్లను నలుపు రంగులోకి మార్చడంతో పాటు ఫుట్‌రెస్ట్‌ను మరింత పెంచారు. సీట్ల వెనుక మ్యాగజైన్‌ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం సీట్ల కింద ఏర్పాటు చేసిన ఛార్జింగ్‌ పాయింట్లను సులువుగా ఉపయోగించుకునేలా మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.


వీటితోపాటు టాయిలెట్‌లో మెరుగైన లైటింగ్ కోసం 2.5 వాట్‌ బల్బులు, గట్టిగా ఉండే హ్యాండిల్స్‌ను అమర్చారు. చేతుల కడిగే సమయంలో వాషిన్ బేసిన్‌ నుంచి నీళ్లు బయటికి రాకుండా వాటి సైజ్‌ను పెంచారు. ప్రయాణికుల సౌకర్యంగా ఉండేలా వాటర్‌ ట్యాప్‌లు, టాయిలెట్ హ్యాండిల్స్‌ను కొత్తగా డిజైన్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దివ్యాంగుల వీల్‌ఛైర్‌లను భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్‌ల ఏర్పాటు.... ప్రయాణికులకు మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్ కోసం ఎయిర్‌టైట్‌ ప్యానల్స్‌లో మార్పులు చేశారు. దాంతోపాటు లగేజ్‌ ర్యాక్‌ లైట్లకు గతంలో కంటే మరింత మృదువైన టచ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్‌ ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు.


సులభమైన నిర్వహణ కోసం ట్రైలర్ కోచ్‌లలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డోర్‌ల కోసం హాచ్ డోర్లు.. రెసిస్టివ్ టచ్ నుంచి కెపాసిటివ్ టచ్‌కి మార్చడం ద్వారా లగేజ్ రాక్ లైట్ల కోసం టచ్ కంట్రోల్స్.. డ్రైవింగ్‌ సమయంలో మెరుగైన దృశ్యమానత కోసం డ్రైవింగ్ కోచ్‌లలో డ్రైవర్ కంట్రోల్ ప్యానెల్‌... ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్‌ను మార్చడం వంటివి ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com