శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఆదివారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది. సెప్టెంబరు 25న, సోమవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న సంప్రదాయం మేరకు ముందు రోజు సాయంత్రం శ్రీవారి కల్యాణ కట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. ఇందుకోసం ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డికి బంగారు గొడుగును అప్పగించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంతులు గారు తిరుమలలో తొలి కళ్యాణ కట్టను ఏర్పాటు చేసి.. యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించారన్నారు. ఆయన వంశస్థులు వంశ పారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించడం ఆచారంగా వస్తుందన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం.. ఆ తర్వాత మహంతుల పాలనలోనూ కొనసాగిందన్నారు.
1946వ సంవత్సరంలో పంతులు గారి వంశస్తులైన ధర్మకర్త శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు.. కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించారని భూమన తెలిపారు. అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు.. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో.. పంతులుగారి వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి.. తిరుమల మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి రథానికి ప్రతిష్టించే ఆచారం కొనసాగుతోందన్నారు.
పంతులు గారి వంశస్తులైన శివరామయ్య కుమారుడు రామనాథన్.. గత 39 ఏళ్లుగా బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుంచి నాలుగు మాడ వీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి.. స్వామివారి రథానికి సమర్పిస్తున్నారని, ఇది ఆయన పూర్వజన్మ సుకృతమని టీటీడీ చైర్మన్ తెలిపారు. పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులు గారి రామనాథన్ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు బంగారు గొడుగు ఉత్సవాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు యానాదయ్య, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో సెల్వం, ఏఈవో రమాకాంతరావు తదితరులు పాల్గొన్నారు.