కడప జిల్లా జమ్మలమడుగులో బాంబు కలకలం రేపింది. స్థానిక ముదునూరు రోడ్డులోని ఓ రియల్ ఎస్టేట్ స్థలంలో శుక్రవారం ఉదయం స్థానికులు బాంబును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, టౌన్ సీఐ సదా శివయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దొరికిన బాంబు గురించి స్థానికులతో ఆరా తీస్తున్నారు. 2019 జులై 23న అదే స్థలంలో 54 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. మళ్లీ అదే స్థలంలో ఇప్పుడు బాంబు దొరకడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
2019లో కూడా ఇదే స్థలంలో భారీగా నాటు బాంబులు బయటపడ్డాయి. ఈ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఓ బకెట్‌ను ట్రాక్టర్ డ్రైవర్ గనమించాడు. అనుమానంతో బకెట్ దగ్గరకు వెళ్లి చూస్తే.. అందులో నాటు బాంబులు ఉన్నాయి. వెంటనే అతడు అక్కడే ఉన్నవారితో కలిసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. అనుమానంతో బకెట్ దొరికిన చుట్టు పక్కల జేసీబీ సాయంతో తవ్వితే మరికొన్ని బాంబులు బయటపడ్డాయి. మొత్తం 54 బాంబులు బయటపడగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.