విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న ఈ బెట్టింగ్‌లో వందలాది మంది యువకులు కోట్లాది రూపాయాలు పోగొట్టుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. పక్కా ప్లాన్‌తో బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన మహాదేవ్ అన్‌లైన్ బెట్టింగ్ ముఠా సభ్యులు విచారణలో కీలక విషయాలను వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రా సత్తిబాబు అనే యువకుడు బెట్టింగులో రూ.8 లక్షలు పొగొట్టుకున్నాడని, అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.
సూరిబాబు అనే ప్రధాన బుకీ ఖాతాకు నగదు వెళ్తున్నట్టు గుర్తించామని డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. అనకాపల్లి జిల్ల అచ్చుతాపురానికి చెందిన రెడ్డి సూరిబాబు, దినేష్ అలియాస్ మోను, వాసుదేవరావు ప్రధాన బుకీలుగా గుర్తించారు. ఈ ముగ్గురి సహా 11 మందిని అరెస్ట్ కోర్టులో హాజరుపరిచారు. 11 రకాల ఆన్‌లైన్ సైట్‌లు, యాప్‌ల ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. మొత్తం 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. 36 ఖాతాల నుంచి వచ్చిన డేటా ప్రకారం రూ.367.62 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేలింది.
ఒక్క మోను బ్యాంకు ఖాతా నుంచే రూ.145 కోట్ల లావాదేవీలు జరిగాయని డీసీపీ వివరించారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రధాన నిందితుడు సూరిబాబు తొలుత పలు యాప్‌లు, సైట్‌లలో బెట్టింగ్ అడటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి EXCH666 నుంచి ఆధరైజేషన్ తీసుకొని బెట్టింగ్ బుకీగా మారి అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ టైంలో బెట్టింగులకు పాల్పడ్డినట్టు చెప్పారు. ఒక్కొక్క మ్యాచ్‌కి రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 నుంచి 6 కోట్లు టర్నోవర్ జరిగేది. వసూలు చేసిన మొత్తాన్ని దినేష్ కుమార్‌కు పంపి.. కమిషన్ తీసుకున్నట్టు తేలింది. ఈ విధంగా తనకి తెలిసిన వ్యక్తులను కూడా బుకీలు మార్చి కమిషన్ కోసం బెట్టింగ్ నిర్వహించినట్టు వెల్లడయ్యింది.