ఏదైనా ఒక కేసులో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఆ ఎఫ్ఐఆర్ తప్పు అని కోర్టులు భావించి కొట్టివేస్తే.. ఆ కేసుకు సంబంధించిన వార్తలు ప్రచురించిన వెబ్‌సైట్లు వాటిని తొలగించాలని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసినా.. ఆ కేసుకు సంబంధించిన వార్తలు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ కావడం వల్ల ఆరోపణలు మోపబడిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే వీటికి సంబంధించి వార్తలను తొలగించడానికి తాము ఎలాంటి ప్రత్యేకమైన సూచనలు జారీ చేయడం లేదని పేర్కొంది. ఓ వ్యాపారిపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టు ఆ ఆరోపణలను కొట్టివేసినా.. ఆ కేసుకు సంబంధించిన వార్తలు ఆన్‌లైన్‌లో కనిపించడంపై బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
బంగారం కొనుగోలు పేరుతో రూ.3.55 కోట్లు మోసం చేశారని 30 ఏళ్ల బిజినెస్‌మెన్‌పై గతంలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అయితే ఆ కేసును కొట్టివేస్తూ ఆ వ్యాపారవేత్తపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కోర్టు కొట్టివేసినా.. ఆన్‌లైన్‌లో ఆ కేసుకు సంబంధించి తాను నిందితుడు అని చూపించేలా ఉన్న వార్తలు ఇంకా ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయని.. బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన పలు మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ వేశాడు. ఆ వార్తలు, వాటికి సంబంధించిన లింక్‌లను తొలగించేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు. బాధితుడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఆయా మీడియా సంస్థలకు నోటీసులు పంపించింది.
ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసినపుడు ఆ వ్యక్తికి సంబంధించి నిందితుడిగా చూపిస్తూ ఉన్న వార్తలను తొలగించాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలకు ఉంటుందని గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో నష్టపరిహారం కోసం బాధితుడు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని చీఫ్ జస్టిస్ సూచించారు. అయితే తమకు కావాల్సింది నష్ట పరిహారం కాదని.. ఆన్‌లైన్‌లో ఉన్న వార్తలు తొలగించేలా ఆదేశాలు ఇచ్చి సత్వర ఉపశమనం కల్పించాలని బాధితుడి తరఫు లాయర్ వాదించారు. ఒక వ్యక్తి క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలైతే.. ఆ కేసుకు సంబంధించిన వార్తలను తొలగించాలని.. అలాంటప్పుడే ఇలాంటి పరిణామాలు ఎదురుకావని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ కొట్టివేసినా.. ఆ కేసుకు సంబంధించిన వార్తలను ఎందుకు తొలగించలేదని సదరు మీడియా సంస్థలను కోర్టు ప్రశ్నించింది. అయితే కోర్టు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆ మీడియా సంస్థల తరఫు న్యాయవాది.. కేసు కొట్టివేసినపుడు దానికి సంబంధించిన వార్తను కూడా రాసినట్లు తెలిపాడు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు.. వార్తలు చూసేవారు రెండు వార్తలు చూడలేరు కదా.. ఒకవేళ ముందు వార్తను చూసి తర్వాత వార్తను చూడకపోతే ఆ వ్యక్తిని నిందితుడిగానే భావిస్తారు కదా అని వ్యాఖ్యానించింది. అంతకుముందు ఫైల్ చేసిన కథనాన్ని ఎందుకు తొలగించలేరని.. జస్టిస్ అగర్వాల్ ప్రశ్నించారు.