ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులను మార్చేసి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాము ఇచ్చిన ఉత్తర్వులనే మార్చేయడంతో ధర్మాసనంలోని న్యాయమూర్తులు విస్తుపోయారు. అంతర్గత విచారణలో తమ ఆదేశాలను మార్చేశారని తేలడంతో పోలీసు కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని ధర్మాసనం సూచించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం రిజిస్ట్రార్‌ను ఈ మేరకు ఆదేశించింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించేలా పోలీసు అధికారికి సూచించాలని పేర్కొంది.
ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది ప్రీతి మిశ్రాను విచారణకు హాజరు కావాల్సిందిగా తాము ఆదేశించామని, ఆమె రాలేదని ధర్మాసనం గుర్తు చేసింది. న్యాయవాది పాత్రపై పోలీసు విచారణ జరగాలని స్పష్టం చేసింది. పిటిషన్‌తోపాటు రెండు వేర్వేరు ఉత్తర్వులను జత చేయడాన్ని ధర్మాసనం తొలుత గుర్తించింది. మొదటి ఆదేశాల్లో పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా.. రెండోది అనుమతించినట్లుగా ఉంది.
దీంతో అంతర్గత విచారణకు ధర్మాసనం గతంలో ఆదేశించింది. తమ ఆదేశాలను మార్చినట్లు తేలడంతో పోలీసు కేసు పెట్టాలని సూచించింది. దీంతో సంబంధమున్న న్యాయవాదులు ప్రీతి మిశ్రా, అఫ్తాబ్ అలీఖాన్‌లతోపాటు పిటిషనర్ మనిష్ మదన్‌మోహన్‌కు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రకు చెందిన మనీశ్ మదన్‌మోహన్ అగర్వాల్ ఓ సివిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి తరఫున న్యాయవాది ప్రీతి మిశ్రా పిటిషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మిట్టల్‌ల ధర్మాసనం.. 2020 జులై 25న పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే, ఆగస్టులో కోర్టు ఉత్తర్వులు ఫోర్జరీ అయినట్టు న్యాయమూర్తులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌కు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జతచేయడాన్ని గమనించారు. అసలు ఆర్డర్ పిటిషన్‌ను కొట్టివేసిట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గుర్తించారు. నివేదికను బుధవారం కోర్టుకు సమర్పించగా.. న్యాయవాది ప్రీతి మిశ్రా మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆమె పాత్రపై కూడా విచారణ జరిపించాలని ధర్మాసనం ఆదేశించింది.