ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర తొలి ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చారు. పోలమాంబను చదురుగుడిలో కొలువుదీర్చారు. దీంతో శంబర గ్రామం జాతర శోభను సంతరించుకుంది. కాగా గోముఖీ నదీతీరాన ఉన్న అమ్మవారి గద్దె వద్ద ఘటాలకు పూజారి, కుప్పిల, గిరడ, మున్సిపల్ కుటుంబాల వారు, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలను గ్రామంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్థులు ఘటాలను చూసి పరవశించిపోయారు. పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాలాలు, డప్పులు, వాయిద్యాలు, భక్తుల కోలాహాలం నడుమ అమ్మవారిని సాదరంగా ఆహ్వానించారు. చదురుగుడిలో కొలువైన అమ్మవారికి 13 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోజూ ఘటాలకు తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 27న తొలేళ్లు , 28న సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4న మారు జాతర నిర్వహిస్తారు. ఇలా పది వారాల పాటు అమ్మవారి జాతర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు పోలినాయుడు, ఉప సర్పంచ్ వెంకటరమణ, ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ దాలినాయుడు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.