కోళ్లు కత్తులు దూస్తున్నాయి. కోట్లు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ పందెం కోడి.. తొడకొట్టి బరిలోకి దిగింది. ప్రత్యర్థితో హోరా హోరీగా పోరాడింది. మినీ స్టేడియాల రీతిలో ఏర్పాట్లు.. వేల మంది వీక్షకులు.. అరుపులు, కేకలు, పందెం రాయుళ్ల జోరు.. వ్యాఖ్యాతల హోరు.. గోదారి జిల్లాలలో సందడి ఇది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పగలూ, రేయి అనే తేడా లేకుండా కోడిపందేలు భారీగా జరుగుతున్నాయి. వేల నుంచి లక్షల వరకూ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇక పందేల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. డబ్బులు చేతిలోనే ఉండాల్సిన పనిలేదు. ఇక్కడ కూడా డిజిటల్ ఇండియా వచ్చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే వెంటనే నగదు ఇచ్చేలా ప్రైవేట్ బ్యాంకులు స్టాళ్లు కూడా ఏర్పాటు చేశాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు.
కోడి పందేలలో గెలిచి డబ్బులు గెలుచుకోవటం ఒకటైతే.. పందెం గెలిచిన కోడి యజమానికి ఇస్తున్న బహుమతులు మరొకటి. ఇలా పందెం గెలిచిన కోడి యజమానులకు ప్రత్యేక బహుమతులు అందిస్తున్నారు. కరపలో ఏకంగా మహీంద్రా థార్ కారు బహుమతిగా ప్రకటించారు. 60 కోడి పందేలలో ఎవరెక్కువ గెలిస్తే వారికి థార్ కారు బహుమతిగా ఇవ్వనున్నారు. హోండా యాక్టివాలు, రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు ఇలా అబ్బో లిస్టు పెద్దగానే ఉంది లెండి. అయితే కోడి పందేలు గెలిచినవారు, పందెం కోళ్ల యజమానుల సంగతి పక్కనబెడితే.. పందెంలో ఓడిపోయిన కోళ్లకు కూడా భారీగా డిమాండ్ ఉంది.
కోడిపందేల్లో చనిపోయిన కోడిపుంజు మాంసాన్ని కోస మాంసం అని పిలుస్తుంటారు. కృష్ణా, గోదావరి జిల్లాలలో ఈ కోస మాంసానికి ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంది సంక్రాంతి పండుగ మూడురోజులలో ఒక్కసారైనా ఈ కోస మాంసం రుచి చూడాలనేది ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే కోస మాంసం కోసం భారీ డిమాండ్ ఉంది. కొంతమంది దూరంగా ఉన్న తమ బంధుమిత్రులకు, రాజకీయ నేతలకు కూడా ఈ కోస మాంసం పంపిస్తున్నారంటే దీనికి ఎంత డిమాండ్ ఉందనేదీ అర్థం చేసుకోవచ్చు. ఈ కోస మాంసాన్ని రూ.2000 నుంచి రూ.3000 పెట్టి మరీ కొంటున్నారు. కనుమ పండుగ రావటంతో ఈ రేటు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఇంట్లో పెంచిన కోడిపుంజులకు గాట్ల పెట్టి అమ్ముతున్నట్లు తెలిసింది. పెరటి కోడిపుంజులను తక్కువ రేటుకు కొనుగోలు చేసి.. బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి.. కోస మాంసంగా అమ్ముతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.