నారావారిపల్లెలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో సోమవారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించగా పరిసర గ్రామాలకు చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలను చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఆమె తల్లి వసుంధర తదితరులు పరిశీలించారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున నగదు బహుమతి అందించారు. అనంతరం పిల్లలకు బెలూన్ బ్లాస్టింగ్, గన్నీ బ్యాగ్ రేస్, మ్యూజికల్ ఛైర్స్, లెమన్ అండ్ స్పూన్, పొటాటో గ్యాదరింగ్ వంటి పోటీలు నిర్వహించారు.ఈ పోటీలకు మంత్రి లోకేశ్ కొంతసేపు యాంకర్‌గా వ్యవహరించి పిల్లలను ఉత్సాహపరిచారు. ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు బహుమతులుఅందజేశారు. సంబరాల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రధానాకర్షణగా మారారు. నారావారిపల్లెతోపాటు పరిసరగ్రామాలకు చెంది న పిల్లలతో కలసి కిందనే కూర్చుని చిట్‌చాట్ చేశారు. వారి పేర్లు, అభిరుచులు తెలుసుకున్నారు. అలాగే తన ఇష్టాలు కూడా వారితో చెప్పారు. పిల్లలతో కొంతసేపు ఫుట్‌బాల్ ఆడారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. పిల్లల ఆటల పోటీల్లో తానుకూడా పాల్గొన్నారు. బెలూన్ బ్లాస్టింగ్, గన్నీ బ్యాగ్ రేస్ పోటీల్లో పాల్గొన్న దేవాన్ష్ గన్నీ బ్యాగ్ రేసులో కన్సొలేషన్ బహుమతి గెలుచుకున్నారు. దేవాన్ష్ సాయంత్రం బంధువుల పిల్లలతోకలసి అలంకరించిన ఎద్దులబండిపై గ్రామంలో అటూ ఇటూ తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నారు.