టీటీడీలో సమన్వయ లోపం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఛైర్మనే కీలకమని.. పాలకమండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేస్తారని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి ఆరుగురు దుర్మరణం చెందారు. అయితే ఇదంతా ఈవో నిర్లక్ష్యంవల్లే జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైరాగిపట్టెడలో భక్తులను అనుమతించే సమయంలో కొన్ని లోపాలు జరిగాయని అన్నారు. అయితే చైర్మన్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని.. గత ఆరు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. మొన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారుర. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.