ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా తర్వాత నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన,,, జనవరి 15న మెట్రో శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 07:13 PM

దసరా తర్వాత విశాఖపట్నం కేంద్రంగా జగన్ సర్కారు పరిపాలన సాగించడానికి అడుగులేస్తున్న వేళ.. నగర అభివృద్ధిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విశాఖ నగరంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులేస్తోంది. తొలి విడత మెట్రో రైలు ప్రాజెక్టు కోసం జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. సంకాంత్రి కానుకగా.. జనవరి 15న విశాఖ మెట్రోకు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతలో 76.90 కి.మీ. మేర లైట్‌ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మూడు కారిడార్లు, 42 స్టేషన్లతో చేపట్టనున్న తొలి విడత మెట్రో నిర్మాణం కోసం దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమని అంచనా. స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు ఉండే కారిడార్-1 పొడవు 34.40 కి.మీ. ఉంటుంది. గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కి.మీ. పొడవైన రెండో కారిడార్ ఉంటుంది. తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు 6.75 కి.మీ. పొడవున మూడో కారిడార్ ఉంటుంది. రెండో విడతలో నిర్మించే కారిడార్-4ను కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 30.67 కి.మీ. పొడవున నిర్మించనున్నారు. మొత్తం కలిపి 54 మెట్రో స్టేషన్లు, రెండు డిపోలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశలు కలిపితే రూ.14,309 కోట్లు అవసరం. దీంతో నిధుల సమీకరణ దిశగా చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


అప్పుడెప్పుడో జవనరిలో శంకుస్థాపన చేసే దానికి ఇప్పుడెందుకు ప్రచారం చేసుకోవడం అని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. జనవరిలో శంకుస్థాపన చేసినప్పటికీ.. అంతా సవ్యంగా సాగితే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విశాఖ మెట్రో నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో తరహాలో కేంద్రం, రాష్ట్రం, ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంలో విశాఖ లైట్ మెట్రోను నిర్మించే ఛాన్స్ ఉంది. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో మెట్రో ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నష్టాలొస్తున్నాయి. దీంతో లాభ నష్టాలతో సంబంధం లేకుండా... ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడం కోసం విశాఖ మెట్రోను నిర్మిస్తామని జగన్ సర్కారు చెబుతోంది.


వాస్తవానికి విశాఖ మెట్రో నిర్మాణం కోసం చంద్రబాబు హయాంలోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను కూడా బాబు హయాంలో ఏర్పాటు చేశారు. కానీ ఆర్థిక ఇబ్బందులు, ప్రాజెక్టు లాభదాయకం కాదేమోననే అనుమానాల నేపథ్యంలో విశాఖ మెట్రో ముందుకు సాగలేదు. రూ.8300 కోట్ల అంచనాతో 42.55 కిలోమీటర్ల పొడవున.. విశాఖలో “లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు” కోసం 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఏడాది ఆరంభంలో తెలిపారు. 75.3 కిలోమీటర్ల పొడవుతో రూ. 15,993 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. విశాఖ నగరానికి మెట్రోతోపాటు.. బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ ఏర్పాటు దిశగానూ జగన్ సర్కారు అడుగులేస్తోంది. 60.5 కిలోమీటర్ల మేర 4 కారిడార్లలో ట్రామ్ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆర్థిక వనరులను సమకూర్చుకొని.. మెట్రో, ట్రామ్ వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగితే.. విశాఖ స్వరూపమే మారిపోతుంది అనడంలో సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com