చిన్నారి ప్రాణాలను కాపాడిన ఇద్దరు డాక్టర్లను పలువురు ప్రశంసించారు. ఇందులో గొప్పేముంది అనుకోకండి. రాంచీ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ చిన్నారి శ్వాస తీసుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడగా... అదే విమానంలో ప్రయాణిస్తున్న ఝార్ఖండ్ గవర్నర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి, మరో డాక్టర్ తో కలిసి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు. ఆ పాపకు జన్మతః గుండె జబ్బు ఉంది. అయితే, విమానం గాల్లోకి లేచిన అనంతరం ఆ బాలిక ఊపిరాడక సతమతమైంది. దాంతో, విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే స్పందించాలని విమాన సిబ్బంది అనౌన్స్ చేశారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ నితిన్ కులకర్ణి, డాక్టర్ మొజామిల్ ఫిరోజ్ ముందుకొచ్చారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో ఆ చిన్నారికి కృత్రిమ శ్వాస అందించి ప్రాణాలు నిలిపారు. మరోవైపు విమానం ఢిల్లీలో దిగగానే, అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో ఆ పాపను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాపను విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించిన డాక్టర్ నితిన్ కులకర్ణి, డాక్టర్ మొజామిల్ ఫిరోజ్ లను అందరూ అభినందించారు. డాక్టర్ నితిన్ కులకర్ణి గతంలో వైద్యుడు. ఆ తర్వాత ఐఏఎస్ గా వచ్చి ప్రస్తుతం ఝార్ఖండ్ రాజ్ భవన్ లో గవర్నర్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.