ప్రశ్నించే గళాన్ని ఏ విధంగా అయినా అణగదొక్కాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. కాశీబుగ్గ, కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరాలను ఎంపీ రామ్మోహన్‌నాయుడు సందర్శించారు. దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో నియంతలా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌ను ప్రజలంతా తరిమికొట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. హక్కులను హరిస్తూ.. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు, దాడులతో గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ సహా 151 మంది ఎమ్మెల్యేలు, 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు.. వ్యక్తిగత ప్రయోజనాలకు మినహా, గతనాలుగున్నరేళ్లలో ప్రజాసంక్షేమం కోసం ఏమీ చేయలేదన్నారు. ప్రజల కోసం పాటుపడని వైసీపీ నేతలను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని ఎంపీ పిలుపునిచ్చారు.