ఉగ్రవాద కర్మాగారంగా మారిపోయిన పాకిస్థాన్.. అక్కడ నుంచి విదేశాలకు ముష్కర మూకలను రవాణా చేస్తోంది. అయితే, పాక్ నుంచి కేవలం ఉగ్రవాదులే కాదు.. అడుక్కునేవారు, జేబు దొంగలు విదేశాలకు వెళుతుండటం గమనార్హం. పాక్ బిచ్చగాళ్లు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు భారీగా తరలి వెళుతున్నారు. దీంతో ఆయా దేశాలకు బిచ్చగాళ్లు తలనొప్పిగా మారుతున్నారు. దీంతో సౌదీ అరేబియా ఏకంగా పాకిస్థాన్‌కు ఫిర్యాదు చేసింది. హజ్ యాత్రికుల పేరుతో తమ దేశానికి భారీగా పాక్ నుంచి బిచ్చగాళ్లు వస్తున్నారని, వీరిని కట్టడి చేయాలని సౌదీ కోరింది.
దీంతో ముల్తాన్ ఎయిర్‌పోర్ట్‌లో సౌదీకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానంలోని 24 మంది బిచ్చగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బిక్షాటన కోసం విదేశాలకు వెళుతున్నవారిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. రెండు రోజుల కిందట మరో విమానం నుంచి కూడా 16 మంది బిచ్చగాళ్లను పోలీసులు దింపేశారు. హజ్ యాత్రికులకు సులభతరంగా వీసాలు జారీ చేస్తారు. దీన్ని పాకిస్థాన్‌లోని బిచ్చగాళ్లు తమకు అనుకూలంగా వాడుకుని, పర్యాటకం పేరుతో గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
పాక్ బిచ్చగాళ్లు మక్కా యాత్ర ముసుగులో తమ దేశానికి వస్తున్నారని సౌదీ అరేబియా వాపోతోంది. మక్కా పరిసరాల్లో తాము అరెస్టు చేసిన బిచ్చగాళ్లలో 90 శాతం పాకిస్థాన్‌కు చెందిన వారేనని తెలిపింది. తమ జైళ్లన్నీ మీ నేరస్థులతో నిండిపోతున్నాయని ఆరోపించింది. మరోవైపు, ఈ అంశంపై పాకిస్థాన్ సెనేట్ కమిటీ కూడా సంచలన నివేదికను వెల్లడించింది. దేశ ప్రతిష్ఠను దిగజార్చుతూ భారీగా బిచ్చగాళ్లు విదేశాలకు వెళ్తున్నట్లు నివేదికలో అంగీకరించింది. అంతేకాకుండా సౌదీలో అరెస్టవుతోన్న జేబు దొంగల్లోనూ మెజార్టీ పాక్ జాతీయులేనని ఒప్పుకుంది.కాగా, పదేపదే నేరస్థులను పంపుతుండటంతో పాకిస్థాన్ విదేశీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వీరంతా అరబ్ వీసాలపై కాకుండా ఉమ్రా వీసాలపై వస్తున్నట్టు సౌదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని స్కిల్డ్ లేబర్‌గా సౌదీ అరేబియా విశ్వసించకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ విషయంలో భారత్, బంగ్లాదేశ్ కార్మికులపై ఎక్కువగా ఆధారపడతారు.