టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఆశ్రయించారు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది. అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు. అదే రోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరో బెంచ్ కేటాయించి అక్టోబర్ 3న విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ తదితర ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేవియట్ దాఖలు చేసి విచారణలో ఏపీ ప్రభుత్వం భాగమైంది. తన వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించింది. కేసును ఈ నెల 9కి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.