జనసేన జనవాణి కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. తమ బాధలు తీరడం లేదని వికలాంగులు చెప్పుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు బధిరులు ఉంటే.. ఒకరికే పెన్షన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వం అనేక మందికి పెన్షన్ కూడా తొలగించిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కనుచూపు లేనివారు, విభిన్న ప్రతిభావంతుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందన్నారు. వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. భవనం ఉన్నప్పటికీ.. సరైన వసతులు లేవన్నారు. వారి బాధలు చెప్పుకునేందుకు సరైన ఫ్లాట్ ఫాం లేదన్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నా... వారికి మేలు చేయడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే.. ఒకరికే పెన్షన్ అంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానసిక ధృక్పధం లేదన్నారు. విభిన్న ప్రతిభావంతులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.