మాజీ మంత్రి, మాడుగుల మాజీ ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను చికిత్స నిమిత్తం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి హుటా హుటిన తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చీడికాడం మండలం పెదగోగాడలో నివాసం ఉంటున్న రెడ్డి సత్యనారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కుమారుడు రాము గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యం చేయించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారు.
రెడ్డి సత్యనారాయణ సోమవారం ఉదయం ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో చోడవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకు అక్కడ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చోడవరం వైద్యుల సూచనతో విశాఖలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చారు. 24 గంటలు గడిస్తేగాని పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమని వైద్యులు తెలిపినట్టు ఆయన కుమారుడు రాము చెప్పారు.
సత్యనారాయణ మాడుగల నియోజకవర్గం నుంచి 1984, 1985, 1989, 1994, 1999లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004లో ఆ నియోజకవర్గంలో ఆయన టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే ఆయన మంత్రిగా పనిచేశారు. టీటీడీప బోర్డు సభ్యుడిగా, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు.