మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్నాయత్నం కింద జగన్ ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం దుర్మార్గమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గొట్టిపాళ్ల సంఘటన సమయంలో బ్రహ్మారెడ్డి తిరుపతిలో ఉంటే కేసు ఎలా పెడతారు? రాష్ట్రంలో విధ్వంస, అరాచక పాలనకు అక్రమ కేసు నమోదే నిదర్శనం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ కేసు నమోదు చేయించారు. కక్షసాధింపులో భాగంగానే బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దాడిచేసిన వైసీపీ నాయకులపై నామమాత్రపు కేసులు పెట్టారు. బాధితులైన టీడీపీ నేతలు, కార్యకర్తలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల పట్ల కక్షసాధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలి. బ్రహ్మారెడ్డి, ఇతర టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా నమోదు చేసిన హత్యాయత్నం కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.