ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని వెలువడిన తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన నోరుజారి.. తర్వాత నాలుక్కరుచుకున్నారు. ‘‘మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం పోతుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వాలు కూడా దిగిపోతాయి’’ అని పొరపాటున అనేశారు. వాస్తవానికి రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
అయితే, కంగారులో ఆయన ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఈసారి ఓడిపోతుందని చెప్పారు. వెంటనే తన తప్పుని గ్రహించిన రాహుల్.. మీరు (విలేకర్లు) గందరగోళానికి గురిచేయడం వల్ల తాను తప్పుగా మాట్లాడానని స్పష్టం చేశారు.
అనంతరం రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘‘ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో మా ప్రభుత్వం ఉంది.. మళ్లీ ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించి, తిరిగి అధికారం చేపడుతుంది.. అటు మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది.. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. నిజం చెప్పాలంటే.. ఈసారి మా పార్టీకే వాతావరణం సానుకూలంగా ఉంది’ అని చెప్పారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలతో బీజేపీకి ఆయుధం లభించినట్టయ్యింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని రాహుల్ గాంధీ అంగీకరించారంటూ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెల్లడించిన ఈసీ.. నవంబర్ 7 నుంచి 30 మధ్య పోలింగ్ జరగనున్నట్టు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబరు 7, 17న పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, తెలంగాణలో నవంబర్ 30న, మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3 ఫలితాలను వెల్లడిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న 20 స్థానాలు, 17న 70 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.