యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంతర్జాతీయ పౌరులకు గమ్యస్థానంగా మారింది. వివిధ దేశాల నుంచి ధనవంతులు అక్కడ నివాసం, వ్యాపార సంస్థల ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు సులభంగా పౌరసత్వం పొందడం, స్వంత నివాసం ఏర్పాటుచేసుకోడానికి యూఏఈ తీసుకొచ్చిన వినూత్న విధానం గోల్డెన్ వీసా. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషిచేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వీసా విధానాన్ని 2019లో ప్రకటించగా.. గతేడాది అక్టోబరు 3 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ వీసా ద్వారా విదేశీయులు అక్కడ దీర్ఘకాలికంగా నివసించే వీలు కలుగుతుంది. ఐదు, పదేళ్ల కాలపరిమితి ఉండే ఈ వీసా ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతాయి. దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన యూఈఏ.. విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి వీలు కల్పించింది. అలాగే వందశాతం యాజమాన్య హక్కులతో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఎమిరైట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గోల్డెన్ వీసా ముఖ్యమైన ప్రయోజనాల్లో దీర్ఘకాలిక నివాసం ఒకటి. పదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే పునరుత్పాదక నివాస వీసాపై యూఏఈలో నివసించడానికి ఇది అనుమతిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసిన కేటగిరీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసినంత కాలం వీసాను పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉంటుంది.
సాధారణంగా యూఏఈలో నివాస వీసాలకు స్పాన్సర్ అవసరం. అది ఉద్యోగం ఆఫర్ చేసిన కంపెనీ లేదా ఇప్పటికే అక్కడ నివాసం ఉన్న కుటుంబసభ్యుడు కావచ్చు. కానీ, గోల్డెన్ వీసాతో సహా స్వీయ-ప్రాయోజిత వీసా ఆప్షన్స్ వల్ల విదేశీ ప్రతిభావంతులు తమ ఉద్యోగాలను మరింత సులభంగా మారేందుకు ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే వారి మునుపటి యజమాని స్పాన్సర్ చేసిన వారి నివాస వీసాను రద్దు చేయాల్సి అవసరం లేదు. అలాగే, 6 నెలల కంటే ఎక్కువ కాలం యూఏఈ వెలుపల ఉన్నా కూడా వీసా రద్దు కాదు గోల్డెన్ వీసాదారులు 10 ఏళ్ల రెసిడెన్సీని కలిగి ఉండటం వల్ల ప్రతి కొన్నేళ్లకు రెసిడెన్సీని రెన్యువల్ చేయకుండా నివారించవచ్చు. గోల్డెన్ వీసా ప్రాథమిక హోల్డర్ మరణిస్తే ప్రాయోజిత కుటుంబసభ్యుల అనుమతి చెల్లుబాటుకు హామీ ఇస్తుంది.
ఎంత మంది గృహ సహాయకులనైనా స్పాన్సర్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం యూఏఈలో నివాసం లేకుంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక ఆరు నెలల బహుళ-ప్రవేశ విజిట్ వీసా ఉంటుంది. ఇది యూఏఈకి వచ్చి దరఖాస్తు తాలూకు పేపర్ వర్క్‌ను పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. తమ సొంత దశంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న గోల్డెన్ వీసాదారులు.. నేరుగా యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దుబాయ్‌లోని డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకుని, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైతే చాలు లైసెన్స్ మంజూరువుతుంది. దుబాయ్, అబుదాబిలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న గోల్డెన్ వీసాదారులు వారి యజమానికి సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీ పరిధిలోకి వస్తారు. అయితే, విదేశాల్లో నివసించే పెట్టుబడిదారులు, ఫ్రీలాన్సర్లు, ఇతరులు మాత్రం సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గోల్డెన్ వీసాదారులు కోసం నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఓ ప్రత్యేక ఆరోగ్య బీమా ప్లాన్ ఉంది. కాగా, ఈ గోల్డెన్ వీసాను భారత్ నుంచి అందుకున్న మొదటి నటుడు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్. ఆ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులకు ఈ వీసా లభించింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఈ జాబితాలో ఉన్నారు.