ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పర్యటన ఖాయమైంది. ఈ నెల 12న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సామర్లకోట, పెద్దాపురంలో పర్యటన ఖరారు చేశారు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నెల 12న ఉదయం 9.15 నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి పెద్దాపురం చేరుకుంటారు. అక్కడ 10.05 నుంచి 10.15 వరకూ ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తారు. అనంతరం 10.25 నుంచి 10.45 వరకూ సామర్లకోట ఈటీసీ జగనన్న లేఅవుట్‌లో పేదలకు నిర్మించిన గృహాలను సీఎం సందర్శిస్తారు. తదుపరి సామర్లకోట ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళతారు. సభ అనంతరం పెద్దాపురం చేరుకుని 12.20 నుంచి 12.50 వరకూ జిల్లా నాయకులతోనూ, స్థానిక నాయకులతోను సమావేశమవుతారు. అనంతరం 12.55కి పెద్దాపురం నుంచి తాడేపల్లి చేరుకుంటారు. సీఎం జగన్ పర్యటన తేదీ ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సామర్లకోట అర్బన్ లబ్దిదారులకు కేటాయించిన ఈటీసీ లేవుట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు లేఅవుట్ లో పూర్తైన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, రోడ్లు, డ్రైయిన్లు, కరెంట్, తాగునీరు తదితర అంశాలపై గృహా నిర్మాణ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ సరఫరాపై సమీక్ష చేశారు. హెలిప్యాడ్‌తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.